చెన్నై: దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ.. రానా దగ్గుబాటితో కలిసి స్వయంగా నిర్మించిన చిత్రం ‘కాంత’ . సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్రఖని, రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎం.కె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో తమ తాతయ్యను తప్పుగా చూపించారంటూ త్యాగరాజ భాగవతార్ మనవడు, తమిళనాడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ (64) ఆరోపించారు. సినిమా విడుదల కాకుండా ఆదేశాలివ్వాలని చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘కాంత’పై దాఖలైన పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని నటుడు దుల్కర్ సల్మాన్‌కు కోర్టు నోటీసులు ఇచ్చింది.
ప్రముఖుల జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలంటే వారి చట్టపరమైన వారసుల నుంచి అనుమతి తీసుకోవాలని భాగవతార్ మనవడు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. సినిమాలో పాత్రల పేర్లు మార్చినప్పటికీ ప్రజలు గుర్తు చేసుకోగలరని చెప్పారు. భాగవతార్ అనైతికంగా జీవించారని, కంటిచూపు కోల్పోయారని, చివరి రోజుల్లో పేదరికంలో చిక్కుకొని అప్పుల్లో మరణించినట్లు సినిమాలో చిత్రీకరించారని ఆరోపించారు. కానీ, సొంతంగా బంగ్లా ఖరీదైన కార్లు తన తాత వద్ద ఉన్నాయన్నారు. ఎలాంటి చెడు అలవాట్లు ఆయనకు లేవని, కనీస ఆధారాలు లేకుండా అనుచితంగా చిత్రీకరించిన సినిమా విడుదల కాకుండా నిషేధం విధించాలని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు నవంబరు 18వ తేదీలోగా ఇందుకు జవాబు ఇవ్వాలని సినిమా నిర్మాణ సంస్థలు, నటుడు దుల్కర్ సల్మాన్‌కు నోటీసులు జారీ చేసింది




















