ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…”ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తోంది. 6 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశాం. ఇప్పుడది సాకారం అయ్యింది. ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ తయారు చేయటం ఓ సవాలు. అలాగే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయటం కూడా ముఖ్యమైన అంశం. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయి. అందుకే ఆధునిక టెక్నాలజీలపై ఆలోచన చేసిన సీఎం చంద్రబాబు వాటిని నిజం చేస్తున్నారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుంది. సీఎం ఆలోచన చేస్తే దానిని తక్షణం అమలు చేయాలని ఆదేశిస్తారు. అందుకే మంత్రులుగా మేమూ… అధికారులు అంతా వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నాను.” అని లోకేష్ చెప్పారు.



















