వివరాలు:
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో జరిగిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, దూరదృష్టిని ప్రశంసించారు. ప్రజాసేవకుడిగా మోదీ గారు దేశానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ గారు కేవలం ఒక ప్రభుత్వాన్ని నడపడం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు తరాలకూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన దేశ సేవకుడే కాదు, ఓ నిజమైన కర్మయోగి. ఎలాంటి ఫలితాల ఆశలు లేకుండా దేశ అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నారు” అని అన్నారు.
“ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ప్రపంచ పటంలో భారతదేశాన్ని గర్వంగా నిలబెట్టిన మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన నాయకత్వంలోనే గూగుల్ వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు భారత్‌కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు రావడం గర్వకారణం” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజల జీవితాలను మార్చేస్తున్నాయని ఆయన వివరించారు. “జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లాభం కలుగుతోంది. నిత్యావసర వస్తువులు, జీవన భీమా, ఆరోగ్య భీమా ఖర్చులు తగ్గడం వల్ల కుటుంబాలు ఆదా చేసుకోగలుగుతున్నాయి. ఇది నిజమైన ‘సూపర్ సేవింగ్స్’” అని చెప్పారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం కనీసం 15 సంవత్సరాలపాటు కొనసాగాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. “ఇబ్బందులు, సవాళ్లు వచ్చినా మనం నిలబడి ముందుకు సాగాలి. పెట్టుబడులు, పరిశ్రమల విశ్వాసం దెబ్బతినకుండా స్థిరమైన పాలన కొనసాగించాలి. మోదీ గారు, చంద్రబాబు గారు లాంటి దూరదృష్టి గల నాయకత్వం ఉండటం రాష్ట్రానికి అదృష్టం” అని అన్నారు.
“ప్రధాని గారు దేశాన్ని మాత్రమే కాదు, రెండు తరాల భారతీయులను ముందుకు నడిపిస్తున్నారు. దేశ జెండా ఎంత గర్వంగా ఎగురుతుందో, అలాగే దేశ ప్రతిష్ఠను ప్రపంచ పటంలో నిలబెట్టారు. ఆయన నిజమైన కర్మయోగి, దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశకుడు” అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
మోదీ, చంద్రబాబు నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజల సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని చెప్పారు. “వచ్చే తరం ఆశయాలు నెరవేర్చడానికి మనం కలసి పనిచేస్తాం. రాష్ట్రం ప్రగతిపథంలో నడవడం మనందరి బాధ్యత” అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ పవన్ కళ్యాణ్ అన్నారు:
“దేశం, రాష్ట్రం రెండూ ఒకే దిశగా పరిగెడుతున్నాయి. ప్రధాని మోదీ గారు చూపిస్తున్న మార్గం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్ కలిస్తే – ఆంధ్రప్రదేశ్ స్వర్ణ యుగం దూరంలో లేదు.”





















