ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు — అడవి మధ్యలో ఉన్న భూమి అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వారసత్వంగా ఎలా చేరిందని. భూమి ఎప్పుడు, ఎలా చేతులు మారిందో ఖచ్చితంగా గుర్తించాలనీ, దీనిలో ఎవరెవరికి ఎంతవరకు పాత్ర ఉందో స్పష్టమైన నివేదికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేటలో పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో ఉన్నట్లు చెబుతున్న 104 ఎకరాల అటవీ భూములపై బుధవారం అటవీశాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అధికారులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు –
“మంగళంపేటలోని సర్వే నంబర్లు 295, 296లో అసలు భూమి ఎంత ఉంది? అది కాలక్రమేణా ఎలా పెరిగిందో స్పష్టత రావాలి. సబ్‌డివిజన్ పేరుతో అటవీ భూములను ప్రణాళికాబద్ధంగా కలిపేసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఎలా జరిగిందనే అంశంపై పూర్తి దృష్టి పెట్టాలి,” అని అన్నారు.
అలాగే, “రక్షిత అటవీ భూముల్లో ఆస్తులు కబ్జా చేసి ఎస్టేట్‌లు నిర్మించిన వారెవరైనా వారిని ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారుల వివరాలను అటవీశాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలి. వారిపై ఉన్న కేసుల స్థితి ప్రజలకు తెలియజేయాలి,” అని పవన్ సూచించారు.
ఇక, “మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్‌లో అటవీ భూములపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టు నాకు తెలిసింది. దీన్ని కూడా పరిశీలనలోకి తీసుకోండి. భూ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 40.80 ఎకరాలు మాత్రమే ఉన్నా, వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో 77.54 ఎకరాలు చూపారు. ఈ వ్యత్యాసం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి,” అని ఆయన స్పష్టం చేశారు.
మంగళంపేట అటవీ భూముల ఆక్రమణపై విజిలెన్స్ నివేదిక ఎంతో కీలకమని, అందులో ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.



















