అమరావతి: ‘‘మేము 1:1 నిష్పత్తిలో డీఎస్సీ పోస్టుల కోసం ఎంపికయ్యామని చెప్పారని, అభినందనలు కూడా అందుకున్నాము. కానీ, సెలక్షన్ లిస్టులో మా పేర్లు లేవు’’ అని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోరుతూ వారు సచివాలయం ప్రధానద్వారం సమీపంలో ఆందోళన నిర్వహించారు. మంత్రి లోకేశ్‌ను కలవడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధ్రువపత్రాల పరిశీలన కోసం పొందిన కాల్ లెటర్లు ప్రదర్శిస్తూ, ‘‘మేము ఇంటర్వ్యూకు హాజరయ్యాం, ధ్రువపత్రాలు పరిశీలించబడ్డాయి. ఎంఈఓలు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని అభినందించారు. కానీ మా పేర్లు సెలక్షన్ లిస్టులోనూ, రిజెక్ట్ లిస్టులోనూ లేవు. దీనిపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. మేమంతా మధ్యతరగతి ప్రజలేమో. మమ్మల్ని ఆదుకోండి’’ అని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.



















