మంగళవారం తెల్లవారుజామున విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం నమోదైంది. ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో ఉదయం 4.18 గంటల సమయంలో స్వల్ప ప్రకంపనలు అనుభవించారు. భీమిలి బీచ్ రోడ్‌లో పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సింహాచల పరిసరాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ 3.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. జి.మాడుగుల సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సమాచారం.



















