ఇంటర్నెట్ డెస్క్: హమాస్ కీలక నేతలే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై దాడి చేసినందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) ఇటీవల ఆ దేశానికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. సోమవారం వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump)తో భేటీ అనంతరం గాజాలో యుద్దాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై తాజాగా శ్వేత సౌధం బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని విడుదల చేసింది. అందులో ట్రంప్, ఎదురుగా కూర్చున్న నెతన్యాహు ఖతార్ నాయకులతో ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే అప్పటికే రాసి ఇచ్చిన స్క్రిప్ట్ (script)ను చేతుల్లో పట్టుకొని.. ఆయన దానిని చదువుతున్నట్లు చిత్రంలో కనిపిస్తోంది. ఆ సమయంలో నెతన్యాహు పక్కనే కూర్చున్న ట్రంప్ ఫోన్ డయల్పాడ్ను ఒడిలో పెట్టుకొని ఉండడం గమనార్హం. దీంతో ట్రంప్‌నే పట్టుబట్టి మరీ నెతన్యాహుతో క్షమాపణలు చెప్పించినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో త్వరలో యుద్ధం ముగియబోతోందని ఇటీవల ట్రంప్ ధీమాగా చెప్పారు. అనంతరం గాజాలో పరిణామాలపై సోమవారం ట్రంప్, నెతన్యాహు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడి ఒత్తిడి మేరకు ఖతార్ ప్రధాని (Qatar PM) అబ్దుల్ రహమాన్ బిన్ జస్సిమ్ అల్ థానికి ఫోన్లో నెతన్యాహు క్షమాపణలు చెప్పారు. గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాకుండా.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శాంతి కోసం మీ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నానని.. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు ఉండకూడదని ఆయన ఖతార్ ప్రధానితో పేర్కొన్నారు.
కాల్పుల విరమణకు సంబంధించి యూఎస్ ప్రతిపాదన మేరకు ఇటీవల దోహాలో ఖతార్ (Qatar) అధికారులు, హమాస్ నేతలు భేటీ అయ్యారు. వీరి మధ్య చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులను ఖతార్ తీవ్రంగా పరిగణించింది. ఈ దాడులకు సంబంధించి నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు. ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని.. దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించాలన్నారు.




















