భారత రోడ్లపై గతంలో ఆకుపచ్చ నంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలు తక్కువగా మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఇవి తరచుగా కళ్ళకు కనిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 20.2 లక్షల విద్యుత్ వాహనాల (EV) రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇది ఇంతవరకు వచ్చిన అత్యధిక సంఖ్య. వాహన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుతూ, వినియోగదారుల అవసరాలకు తగిన కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. అలాగే, ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించడం కూడా కొనసాగుతోంది.
ఛార్జింగ్ విషయంలో ఆందోళన లేదు
గత సంవత్సరం మొత్తం 19.5 లక్షల ఈవీ రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ, ఈ ఏడాది ఇంకా నెల రోజులకే 20.2 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పెరుగుతున్న వినియోగదారుల కోసం మోడళ్ల లభ్యత పెరగడం, ప్రభుత్వ విధానాల మద్దతు, స్వచ్ఛ వాహనాల ప్రోత్సాహం ఇవన్నీ ఈవీ మార్కెట్‌ను ముందుకు నెట్టాయి. ద్విచక్ర వాహనాలు మార్కెట్‌లో ఆధిపత్యం చూపుతున్నాయి, దాని తరువాత కార్లు, త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. డీలర్ నెట్‌వర్క్‌లు విస్తరించడం, ధరల తగ్గింపు, ఎక్కువ దూరం సైతం వెళ్ళగలిగే మోడళ్ల అందుబాటు వలన వినియోగదారుల విశ్వాసం పెరిగింది. పట్టణాలలోని వినియోగదారులు ఇల్లు లేదా ఆఫీసులో ఛార్జింగ్ చేసుకోవడం వల్ల రేంజ్ లేదా ఛార్జింగ్ విషయంలో ఆందోళన లేదు.
కార్ల కంపెనీల ప్రణాళికలు
మారుతీ సుజుకీ తన ఇ-విటారాతో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టింది. 50,000 నుంచి 1,00,000 ఈవీలను ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. టాటా మోటార్స్ ఇప్పటికే ఆధిపత్యం చూపుతున్న ఈవీ విభాగంలో అధునాతన బ్యాటరీ సాంకేతికత, కొత్త ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఉత్పత్తి పెంపుపై పెట్టుబడులు పెడుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు నెలకు 7,000 ఈవీలను విక్రయించాలనుకుంటోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఛార్జింగ్ సదుపాయాల నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టి, కొత్త మోడళ్లతో తన ఈవీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తోంది. ఎమ్‌జీ మోటార్స్ ఇండియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ఉత్పత్తి పెంచుతోంది మరియు స్థానిక భాగస్వామ్యాలతో పని చేయాలని చూస్తోంది. బీవైడీ కూడా భారత్‌లో రిటైల్ నెట్‌వర్క్ విస్తరణలో కృషి చేస్తోంది. ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా, చైనాకు చెందిన విన్‌ఫాస్ట్ కూడా భారత్‌లో ప్రవేశించాయి.




















