అమరావతి: మాజీ మంత్రి పేర్ని నాని నకిలీ మద్యం కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏ1 జనార్థన్ పెళ్లి పేరుతో రాష్ట్రానికి వచ్చినా ప్రభుత్వం, ఎల్లో మీడియా సిగ్గు లేకుండా అతనికి కవర్ ఇస్తున్నాయి అని విమర్శించారు.
నాని వ్యాఖ్యానిస్తూ, “నకిలీ మద్యం కేసు అసలు నిజాలను దాచిపెట్టడంలో ఎల్లో మీడియా విఫలమవుతోంది. రాష్ట్రంలో లక్షా 50 వేలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇవన్నీ నకిలీ మద్యం విక్రయాల కోసం ఏర్పాటు చేసినవే,” అని ఆరోపించారు.
“జనార్థన్, సురేంద్రనాయుడు, జయచంద్రారెడ్డిపై ఇప్పటికీ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయలేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే జనార్థన్‌తో పోలీసులు వీడియో చేయించారు,” అని ఆయన తెలిపారు.
పేర్ని నాని మాట్లాడుతూ, “రూ.99 మందు అందుబాటులో ఉంటే నకిలీ మద్యం అమ్మలేరని తెలుసుకే దానిని నిలిపివేశారు. ఇప్పుడు ఆ మందు దొరకడం లేదు. కూటమి ప్రభుత్వానికి దానిని తిరిగి సేల్స్‌లోకి తెచ్చే ధైర్యం ఉందా?” అని ప్రశ్నించారు.
ఇంకా, “కూటమి ప్రభుత్వంలో 10 శాతం కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. వైన్ షాపుల్లో 25 శాతం డిజిటల్ లావాదేవీలు ఉన్నాయన్న చంద్రబాబు వాదన పూర్తిగా తప్పు. ప్రజలకు నగదు ద్వారా మాత్రమే మందు అమ్ముతున్నారు,” అని పేర్కొన్నారు.
“జనార్థన్ ఫ్యాక్టరీలోని మందు నకిలీయే కానీ ప్రమాదకరం కాదంటూ అధికారులు మాట్లాడడం ఆశ్చర్యకరం. ప్రభుత్వం తాగుబోతులను కూడా మోసం చేస్తోంది,” అని ఆయన విమర్శించారు.
అలాగే, “జనార్థన్‌కు త్వరలో బెయిల్ ఇస్తారు, సురేంద్రనాయుడు, జయచంద్రారెడ్డి కూడా బయటకు వస్తారు. వైన్ షాపులు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు చేతిలో మోసపోతున్నారు,” అని నాని అన్నారు.
బార్ల లైసెన్స్ ఫీజులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ప్రథమశ్రేణి పట్టణాల్లో రూ.75 లక్షలు, ద్వితీయశ్రేణి పట్టణాల్లో రూ.55 లక్షలు, మూడోశ్రేణి పట్టణాల్లో రూ.35 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. లక్షల రూపాయలు ఇస్తేనే బార్ అనుమతులు వస్తున్నాయి,” అని అన్నారు.



















