వన్యప్రాణులు–మనుషుల మధ్య ఘర్షణలు లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పొలాల్లోకి ఏనుగులు, కోతులు ప్రవేశించి రైతులు నష్టపోకుండా, ఇలాంటి ప్రాంతాల్లో 10–12 ఎకరాల విస్తీర్ణంలో ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేసి రైతుల ఆదాయాన్ని పెంచాలని సూచించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని, వీటికి రేడియో కాలర్లు అమర్చి వాటి కదలికలను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.
ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగులో ఆయన పర్యటించారు. కుంకీ ఏనుగుల శిబిరం, గజారామం నగరవనం ప్రారంభించి, ఏనుగుల నిరోధక కంచె నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఏనుగుల విన్యాసాలను వీక్షించి, వాటికి శిక్షణ ఇచ్చిన మావటీలకు రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందజేశారు. అటవీశాఖ కన్జర్వేటర్ యశోదాబాయి ఏనుగుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వన్యప్రాణులు–మనుషుల మధ్య ఘర్షణలను నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు, ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, ఆధునిక సాంకేతికత, వన్యప్రాణుల ట్రాకింగ్ వంటి అంశాలపై వివరాలు అందించారు. ఈ విషయాలపై నవంబర్ 18న విస్తృత సమావేశం నిర్వహించాలని పవన్ ఆదేశించారు.
రేడియో కాలర్ల ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా, రాష్ట్రంలో ఆరు ఏనుగులకు రేడియో కాలర్లు అమర్చేందుకు కేంద్ర అనుమతి వచ్చిందని యశోదాబాయి తెలిపారు. పవన్ దీనిపై స్పందిస్తూ ప్రతి పనికి గడువు నిర్ధేశించకుంటే ఆలస్యం జరుగుతుందని హెచ్చరించారు. ఆరునెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెప్పగా, మరింత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఏనుగుల దాడులతో రైతులకు నష్టం జరిగితే, వ్యవసాయ, ఉద్యాన, పట్టు శాఖ అధికారులు యాప్‌లో వివరాలు నమోదు చేస్తే త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు.
కోతుల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉందని, వాటిని పట్టుకుని స్టెరిలైజ్ చేయాలని యశోదాబాయి చెప్పగా, పవన్ “అది నిజంగా సాధ్యమేనా?” అని ప్రశ్నించారు. ఈ పనికి శిక్షణ పొందిన వ్యక్తులు ఉన్నారని ఆమె సమాధానం ఇచ్చారు. పాముల సమస్యల సందర్భంలో పంచాయతీల్లో ‘సర్పమిత్ర’ సేవలను వినియోగిస్తున్నట్లు పేర్కొని, జిల్లా అటవీశాఖ అధికారులు వీరికి అధికారిక గుర్తింపు ఇస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తారని పవన్ సూచించారు.
ఈ సందర్భంగా ఏనుగులు చూపిన విన్యాసాలను ఆయన ఆసక్తిగా గమనించారు. మోకాళ్లపై నిలబడి పవన్‌కు అభివాదం చేసిన ఏనుగులకు ఆయన సెల్యూట్ చేశారు. అభిమన్యు, కృష్ణ అనే ఏనుగులకు బెల్లం తినిపించి వాటి ఆశీర్వాదం పొందారు. ఏనుగుల దాడులతో నష్టపోయిన రైతులతో మాట్లాడేందుకు షెడ్యూల్ ఉన్నప్పటికీ, ప్రజెంటేషన్ ఆలస్యంతో ఆ కార్యక్రమం రద్దు కావడంతో రైతులు నిరాశ చెందారు.
తర్వాత పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిన అటవీ భూములను హెలికాప్టర్ ద్వారా పవన్ పరిశీలించారు. ఈ ఏడాది జనవరి 29న ‘ఈనాడు’లో ప్రచురితమైన “అడవిలో అక్రమ సామ్రాజ్యం” కథనంపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసి, 32.64 ఎకరాల అటవీ భూమి ఆక్రమణను నిర్ధారించింది. ఆ భూమిని అటవీశాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది.




















