ఇంటర్నెట్డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మరో ఇద్దరు చనిపోయారు. బాఘ్, ముజఫరాబాద్, మిర్పుర్ ప్రాంతాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొన్నిరోజులుగా పీవోకేలో నిరసనలు జరుగుతున్నాయి. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 70 ఏళ్లకుపైగా పీవోకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని వాపోయారు. పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ‘‘షటర్-డౌన్.. వీల్-జామ్’’ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ను నిలిపివేసింది.
ఈ నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ప్రస్తుత నిరసనలు ప్లాన్ ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్లాన్లు ఉన్నాయని ఏఏసీ లీడర్ షౌకత్ నవాజ్ మిర్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




















