నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై వెంటనే చలానాలు వేయకుండా, ముందుగా వారికి అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్ లేకుండా, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపేవారికి ముందుగా హెచ్చరిక ఇచ్చి, తర్వాత కూడా అదే తప్పు పునరావృతమైతేనే చలానాలు విధించాలని ఆదేశించారు. ఉల్లంఘనలపై పెద్దఎత్తున చలానాలు వేయాలన్న ప్రతిపాదనను సీఎం సున్నితంగా తిరస్కరించారు. “జరిమానాలతో ప్రజలను భయపెట్టడం కరెక్ట్ కాదు” అని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ సమీక్ష సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. మొదటి సారి ట్రాఫిక్ ఉల్లంఘన చేసినవారికి అవగాహన కల్పించి, వారి మొబైల్ ఫోన్‌లకు మెసేజ్ పంపాలని చెప్పారు. ఆ తర్వాత కూడా అదే తప్పు చేస్తే, చలానా విధించినప్పుడు తామే పొరపాటు చేశామన్న అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఈ విధానంలో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సీసీ కెమెరాల సాయంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించే మార్గాలు పరిశీలించాలని సూచించారు. పెద్ద జనసమూహాల వద్ద తొక్కిసలాటలు జరగకుండా క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని, లోపాలు తక్షణమే సరిచేయాలని తెలిపారు.
ఉద్యోగ మేళాలకు ప్రాధాన్యం
రాష్ట్ర వ్యాప్తంగా జాబ్‌మేళాలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు వాటి సమాచారం అందేలా విస్తృత ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు.
సేవలలో మార్పు అవసరం
రిజిస్ట్రేషన్ సేవల విషయంలో కొంత పురోగతి ఉన్నప్పటికీ, ఇంకా ప్రజల్లో అసంతృప్తి ఉందని సీఎం గమనించారు. అధికారుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. “రెండున్నర నెలల్లో రిజిస్ట్రేషన్ సేవల్లో స్పష్టమైన మార్పు కనిపించాలి” అని అన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, రేషన్ పంపిణీ, దీపం–2 వంటి పథకాల అమలుపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు.



















