ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహాబాద్‌లోని ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే పై సోమవారం ఒక ప్రత్యేక ఘటన చోటుచేసుకుంది. దీపావళి బోనస్ పరంగా అసంతృప్తి వ్యక్తం చేసిన 21 మంది టోల్ సిబ్బంది విధులను పక్కన పెట్టి, టోల్ గేట్లను తెరిచారు. దీనితో వేలాది వాహనాలు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఉచితంగా వెళ్లిపోయాయి.
ఈ టోల్ ప్లాజా శ్రీ సైన్ అండ్ డాటర్ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. సిబ్బందికి బోనస్‌గా రూ.1,100 మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. టోల్ మేనేజ్‌మెంట్ ఇతర ప్లాజాల నుండి సిబ్బందిని పిలిచి కార్యకలాపాలు పునరారంభించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆందోళన చేస్తున్న ఉద్యోగులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
పోలీసులు చేరి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తరువాత మేనేజ్‌మెంట్ ఉద్యోగులతో చర్చించి, వేతనం 10% పెంచుతామని హామీ ఇచ్చిన తర్వాత సిబ్బంది ఆందోళనను విరమించారు. ఈ నిరసన కారణంగా టోల్ గేట్లు సుమారు రెండు మూడు గంటల పాటు తెరిచే పరిస్థితి నెలకొంది.




















