ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని గుండ్లకమ్మ జలాశయానికి వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఎగువ ప్రాంతాల వర్షాల కారణంగా గుండ్లకమ్మకు 1,26,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, జలాశయం నుంచి 14 గేట్ల ద్వారా లక్షా 30 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
దీంతో గుండ్లకమ్మ దిగువన ఉన్న పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నది ప్రవాహం తగ్గకపోవడంతో ఒంగోలు–చీరాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
ఇక కొండపి మండలంలోని మూసి నది వరదలో చిక్కుకున్న 120 మంది కూలీలను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమయానికి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వీరిలో ఎక్కువమంది పొగాకు నారుమళ్లలో పనిచేసే కూలీలుగా గుర్తించారు. అధికారులు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.



















