ఐఫోన్ తయారీదారు యాపిల్ సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న భారతదేశంలో తయారీ విస్తరణతో పాటు రిటైల్ స్టోర్లను పెంచడం ద్వారా యాపిల్ బలమైన వృద్ధి దిశలో సాగుతోంది.
అంతర్జాతీయంగా ఈ త్రైమాసికంలో యాపిల్ ఆదాయం 102.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9 లక్షల కోట్లు) చేరింది — ఇది 2024 ఇదే కాలంతో పోలిస్తే 8% అధికం. కొత్త ఐఫోన్ 17కు ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన రావడంతో, డిసెంబర్ త్రైమాసికంలోనూ మరింత బలమైన ఆదాయ వృద్ధి ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.
డిసెంబర్ త్రైమాసికం కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని, ఐఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమాసియా, జపాన్, కొరియా, దక్షిణాసియా వంటి అనేక మార్కెట్లలో యాపిల్ రికార్డు స్థాయి ఆదాయాలను సాధించింది.
ప్రత్యేకంగా వర్థమాన మార్కెట్లలో అత్యుత్తమ ఫలితాలను నమోదు చేశామని, భారత్‌లో ఇప్పటివరకు లేని స్థాయిలో ఆదాయ రికార్డును నెలకొల్పామని కుక్ వెల్లడించారు. అయితే, భారత మార్కెట్‌లోని ఖచ్చితమైన ఆదాయ గణాంకాలను మాత్రం వెల్లడించలేదు.




















