చిన్న వయస్సులోనే కొంతమందికి ముఖంపై ముడతలు ఏర్పడతాయి. దీని వలన వారు వయస్సు కంటే పెద్దవారిలా కనిపిస్తారు. ముఖంపై ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి అనేక కారణాలు ఉండొచ్చు. వీటితో పాటు మనం రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా ముడతలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం…
మితిమీరిన చక్కెర వద్దు:
చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా చర్మం ముడతలు పడే ప్రధాన కారణాల్లో ఒకటట. అధిక చక్కెర వాడకం వల్ల చర్మం తన సహజ మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు ఏర్పడుతాయి అని నిపుణులు చెబుతున్నారు.
కొవ్వులను పూర్తిగా దూరం పెట్టొద్దు:
చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే తగిన పరిమాణంలో కొవ్వులు అవసరం. అయితే లావవుతామన్న భయంతో చాలామంది కొవ్వు పదార్థాలను పూర్తిగా వదిలేస్తారు. కానీ వాటిలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే కొవ్వులను తగిన మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి.
ఒకే పక్కగా నిద్రపోవద్దు:
ఒక్కోసారి మన నిద్రపోయే తీరు కూడా చర్మంపై ప్రభావం చూపుతుంది. ఒకే పక్కగా తిరిగి నిద్రపోవడం లేదా చెంపను దిండుకు ఆనించడం వలన ఆ వైపు చర్మం మృదుత్వం కోల్పోయి ముడతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తలగడపై తలని సరిగ్గా ఉంచి, ముఖంపై ఒత్తిడి రాకుండా నిద్రపోవడం మంచిది.
సబ్బు ఎంపికలో జాగ్రత్త:
చాలామంది కేవలం బ్రాండ్‌ని బట్టి సబ్బును ఎంచుకుంటారు. కానీ అది తమ చర్మానికి సరిపోతుందా లేదా అనేది ఆలోచించరు. సరిపోని సబ్బు వాడితే చర్మం పొడిబారిపోవడం, ముడతలు పడడం జరుగుతుంది. అందుకే చర్మతత్వానికి తగ్గ సబ్బును వాడాలి. అవసరమైతే సౌందర్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.




















