తాను భగవద్గీతను అవమానించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనుకూల సోషల్ మీడియా వర్గాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని టిటిడి పాలకమండలి సభ్యుడు ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన గురువారం (అక్టోబర్ 30, 2025) ఒక వీడియో విడుదల చేసి, తాను చేసిన వ్యాఖ్యల అసలు ఉద్దేశ్యాన్ని వివరించారు.
ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు, వారి అనుకూల సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ చానళ్లలో నేను భగవద్గీతను కించపరిచానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఎక్కడా కూడా భగవద్గీత, ఖురాన్ లేదా ఇతర మత గ్రంథాలపై అవమానకర వ్యాఖ్యలు చేయలేదు. నేను కేవలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి సేవలు, భారత రాజ్యాంగం దళితుల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పులు గురించి మాత్రమే మాట్లాడాను,” అన్నారు.
ఆయన ఇంకా వివరించారు – “భగవద్గీత లేదా ఇతర మత గ్రంథాల వల్ల కాదు, రాజ్యాంగం వల్లే దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. కానీ దాన్ని వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న సేవలను డైవర్ట్ చేయాలనే వైసీపీ కుట్రలో భాగం” అని ఆరోపించారు.
ఎంఎస్ రాజు తన హిందూ విశ్వాసాన్ని మరోసారి స్పష్టం చేస్తూ, “నేను హిందువుని, దళితుడిని. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన అవకాశంతో టిటిడి పాలకమండలి సభ్యుడిగా సేవలందిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా 5,000 దేవాలయాలు నిర్మించే యత్నంలో దళితవాడల్లో ఎక్కువ గుడులు నిర్మించాలని నేను టిటిడి బోర్డుకు సూచించాను. అయినా కూడా నాపై నేను క్రైస్తవుడినని అసత్య ప్రచారం చేయడం బాధాకరం” అని అన్నారు.
అదేవిధంగా ఆయన వైసీపీ నాయకులకు సవాల్ విసురుతూ, “నాకు సంబంధించిన నిజాలు తెలుసుకోవాలంటే నా పుట్టిన ఊరికి వెళ్లి మా కుటుంబం గురించి విచారణ చేయండి. నేను నిజమైన హిందువు, వేంకటేశ్వర స్వామి భక్తుడిని. ఇంట్లో ఒక మతం, బయట మరొక మతం ఆచరించే వ్యక్తిని నేను కాను” అన్నారు.
చివరిగా ఆయన హిందూ సమాజాన్ని ఉద్దేశించి, “నా మాటల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, నేను ఒక హిందూ సోదరుడిగా మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాను” అని తెలిపారు.
అసత్య ప్రచారాలకు తావివ్వొద్దు – నేను హిందువునే : ఎంఎస్ రాజు



















