న్యూఢిల్లీ: బీమా సంస్థలు సాంకేతిక కారణాలను చూపుతూ బాధితులకు పరిహారం చెల్లించకుండా తప్పించుకోవడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వాహనం రూట్ పర్మిట్ ఉల్లంఘించిందన్న కారణంతో బీమా నిలిపివేయడం సహజ న్యాయానికి విరుద్ధమని పేర్కొంది.
కర్ణాటకలో 2014 అక్టోబర్ 7న వేగంగా వచ్చిన బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ బాధితుడి కుటుంబానికి రూ.18.86 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై బీమా సంస్థ రూట్ పర్మిట్ ఉల్లంఘనను చూపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు, బాధితుడికి పరిహారం చెల్లించాల్సిందేనని బీమా సంస్థకు స్పష్టం చేస్తూ, ఆ మొత్తం వాహన యజమాని నుంచి రికవరీ చేసుకోవచ్చని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా సంస్థ మరియు వాహన యజమాని ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా లతో కూడిన ధర్మాసనం విచారణ అనంతరం ఈ రెండు అప్పీల్స్‌ను తోసిపుచ్చింది. “బాధితుడి తప్పు లేకుండా జరిగిన ప్రమాదంలో రూట్ మారిందని బీమా నిరాకరించడం తగదు. అలాంటప్పుడు బీమా సంస్థ పరిహారం చెల్లించి, తరువాత యజమాని నుంచి రికవరీ చేసుకోవచ్చు,” అని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఈ తీర్పుతో బీమా కంపెనీలకు స్పష్టమైన సందేశం పంపింది — సాంకేతిక కారణాలు చెప్పి బాధితులను న్యాయానికి దూరం చేయరాదని.




















