హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబరు 26న ఖమ్మంలో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని మగ్ధూం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో జాతీయ నాయకులతో పాటు అన్ని రాష్ట్రాల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ మాట్లాడుతూ… దేశంలో కొంతమంది కార్పొరేట్ ఆర్థిక నేరగాళ్లు రూ.16 లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోతే… కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో జీఎస్టీ పేరిట రూ.15 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. తమిళనాడులో బహిరంగసభలో చోటుచేసుకున్న తొక్కిసలాటకు టీవీకే అధ్యక్షుడు విజయ్‌దే నైతిక బాధ్యతని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ధన ప్రవాహానికి తెరలేపిందని, ఇందులో భాగంగానే 96 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించిందని పల్లా వెంకట్‌రెడ్డి, నారాయణ ఆరోపించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ పాల్గొన్నారు.


















