నేటి కాలంలో పిల్లలు గంటల తరబడి ఫోన్లు, ఐప్యాడ్‌లకే పరిమితమై పుస్తకాలకు దూరం కావడంపై నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎంతో మంది పబ్లిషర్లు అద్భుతమైన పుస్తకాలను రూపొందిస్తున్నారని, వాటిని పిల్లలకు చేరువ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన గుర్తుచేశారు. తన కుమారుడు దేవాన్ష్‌కు కూడా ఫోన్లు ఇవ్వకుండా రామాయణం, భగవద్గీత వంటి గొప్ప పుస్తకాలను అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. పిల్లలు కేవలం పాశ్చాత్య సూపర్ హీరోలైన స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ గురించి మాత్రమే కాకుండా, మన సంస్కృతికి మూలాలైన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మరియు పరమశివుని గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మనందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడుకుంటూ, పిల్లలను సరైన మార్గంలో నడిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు.



















