వంటగ్యాస్ (LPG) కోసం మన దేశం దిగుమతులపై భారీగా ఆధారపడి ఉంది. గత దశాబ్దంలో దేశీయ అవసరాల్లో 55-60% విదేశాల నుంచి వస్తున్నాయి. దేశీయ ఉత్పత్తి పెరిగినా కూడా, గిరాకీ అంతకంటే ఎక్కువ ఉండటంతో.. LPG దిగుమతులు భారత్కు చాలా కీలకమని CRISIL ఇంటెలిజెన్స్ తెలిపింది. భారత్-అమెరికా మధ్య స్థిరకాల LPG ఒప్పందం కుదిరిన తర్వాత, సంవత్సరానికి 2.2 మిలియన్ టన్నుల LPG దిగుమతి జరుగనుంది. దీని వల్ల సంప్రదాయ మధ్యప్రాచ్య సరఫరాదార్ల వాటా తగ్గుతుంది. అయితే చమురు కంపెనీలకు రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండనున్నాయి.
ఎల్పీజీ వినియోగం:
2024-25లో దేశంలో LPG వినియోగం 31.3 మిలియన్ టన్నులకు చేరింది. 2016-17లో ఇది 21.6 మి. టన్నులే. 2025-26లో 33-34 మి. టన్నుల వరకు చేరుతుందని అంచనా. పీఎమ్ ఉజ్వల్ యోజనలో ఉన్న కుటుంబాలు 2024-25లో సగటున ఏటా 4.5 సిలిండర్లు వాడాయి. 2016-17లో 3.9 సిలిండర్లు మాత్రమే వాడేవారు. పీఎమ్యూవైయేతర వినియోగదారులు గత ఐదు సంవత్సరాల్లో సగటున ఏడాదికి 6-7 సిలిండర్లు వాడుతున్నారు. వాణిజ్య, పారిశ్రామిక వినియోగం మొత్తం గిరాకీలో 16%కి చేరింది. 2016-17లో ఇది 10% మాత్రమే.
దేశీయ ఉత్పత్తి:
2016-17లో 11.2 మి. టన్నులు ఉత్పత్తి కాగా, 2024-25లో 12.8 మి. టన్నులైంది. కానీ గిరాకీ పెరుగుదలతో పోలిస్తే దేశీయ ఉత్పత్తి తక్కువే. అందువల్ల దిగుమతులు 11.1 మి. టన్నుల నుండి 20.7 మి. టన్నుల వరకు పెరిగాయి. 2024-25లో మధ్యప్రాచ్యం నుండి 91-93% LPG దిగుమతులు జరిగాయి. ఇందులో UAE 41%, ఖతర్ 22%, సౌదీ అరేబియా 15%, కువైట్ 15% వాటా కలిగాయి.
ఆంధ్రప్రదేశ్లో టయోటా కేంద్రం:
విశాఖపట్నంలో TVS ILP పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్లో Toyota Bharat Integrated Services (TBIS) ప్రాంతీయ విడిభాగాల కేంద్రాన్ని ప్రారంభించింది. దీనికి 33,000 చదరపు అడుగుల స్థలం లీజ్లో తీసుకుంది. ఈ కేంద్రం ద్వారా TBIS విడిభాగాల లభ్యతను బలోపేతం చేస్తుంది. TBIS జేఎండీ అదితి కుమార్ చెప్పారు: “విశాఖలో అంతర్జాతీయ విడిభాగాల పంపిణీ కేంద్రం ప్రారంభించడం ద్వారా దక్షిణ భారత మార్కెట్లో విస్తరించనున్నాం. విశాఖ వ్యూహాత్మక కేంద్రం, బలమైన పోర్ట్ కనెక్టివిటీ వల్ల తూర్పు, దక్షిణ భారత్కు వ్యయానుకూల గేట్వేగా ఉంటుంది” అని TBIS డైరెక్టర్ ప్రకాశ్ నాయర్ చెప్పారు.




















