అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న కిడ్నీ రాకెట్ వ్యవహారంపై చిత్తూరు జిల్లా వైద్యాధికారుల బృందం విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంలో విశాఖపట్నం నివాసిని యమున మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చిత్తూరు డీసీహెచ్ఎస్ పద్మాంజలి దేవి, వైద్యుడు లక్ష్మీనరసయ్య, ఇతర వైద్యులతో కూడిన బృందం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు.
అసుపత్రి సూపరింటెండెంట్ రమేశ్‌తో మాట్లాడిన బృందం, మృతదేహానికి మదనపల్లెలోనే పోస్టుమార్టం నిర్వహించనందుకు కారణం తెలుసుకున్నారు. ఫొరెన్సిక్ నిపుణులు అందుబాటులో లేకపోవడం వల్ల మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించాల్సి వచ్చినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. తరువాత వైద్య బృందం మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తనిఖీ కోసం వెళ్లి, జిల్లా అధికారులు వేసిన సీల్, తాళాలను తొలగించడం గమనించి తిరిగి వెనుకికి వచ్చారు. తనిఖీ సమయంలో హరగోపాల్, సాయి కిషోర్ తదితర వైద్యులు పాల్గొన్నారు.
వివరాలు: విశాఖపట్నం నివాసిని యమునకు గ్లోబల్ ఆసుపత్రిలో రహస్యంగా కిడ్నీ మార్పిడి జరుగుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి 112కు ఫిర్యాదు అందిన తర్వాత, తిరుపతి పోలీసులు మదనపల్లెలకు చేరి విచారణ చేపట్టారు. మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రాజారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి, ఆసుపత్రి సిబ్బందిలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తోంది.


















