హైదరాబాద్, ఈనాడు: మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వరకు (ఎన్‌హెచ్-167) రహదారికి సంభవిస్తున్న మహర్దశపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ రహదారిలోని రెండు వరుసల రోడ్డు గూడెబల్లూరు (కర్ణాటక సరిహద్దు, రాయచూరు సమీపంలో) వరకు నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. రూ.2,278.38 కోట్ల అంచనాతో 80.01 కిలోమీటర్ల రహదారిని విస్తరించేందుకు టెండర్లు గురువారం ఆహ్వానించారు. టెండర్లు గెలిచిన సంస్థ హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో రహదారిని నిర్మించి, టోల్‌గేట్ల ద్వారా వాహనదారుల నుంచి నిర్మాణ వ్యయాన్ని వసూలు చేయనుంది.
భూమి కోల్పోయే బాధితుల ఖాతాల్లో సుమారు రూ.100 కోట్ల పరిహారాన్ని జమ చేశారు.
హైదరాబాద్, వరంగల్ నుంచి గోవా, రాయచూరు, మంత్రాలయంతో పాటు కర్ణాటకలోని పలు పట్టణాల వైపు ప్రయాణించే వాహనాలు జడ్చర్ల, మహబూబ్‌నగర్ మార్గం ఉపయోగిస్తున్నాయి. ఈ రహదారి నాలుగు వరుసలుగా మారితే, ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.


















