ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరియు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైంది. సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కొలికపూడి హాజరై తన వివరణను నివేదిక రూపంలో కమిటీకి సమర్పించారు. విచారణ అనంతరం ఆయన కార్యాలయం నుంచి వెళ్లగా, కాసేపట్లో ఎంపీ కేశినేని చిన్ని కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్నారు.
వివాదం నేపథ్యం:
ఇటీవలి కాలంలో కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్‌లో ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికల టికెట్ కోసం రూ.5 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తూ పోస్టులు పెట్టడం రాజకీయంగా సంచలనం రేపింది. అలాగే “తిరువూరు పబ్లిక్ పార్క్ కాదు, ఎవరైనా వచ్చినా కుదరదు. నేను జగన్‌పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాను, ఎవరి డబ్బులతో రాలేదు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “పదవులను అమ్ముకున్నది వైకాపా నాయకులే” అంటూ మరోసారి ఘాటుగా స్పందించారు.
ఈ ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ వైకాపా నేతలతో అనుబంధం కలిగి లేనని స్పష్టం చేశారు. “చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లను విమర్శించే వారిని నేను శత్రువుల్లా చూస్తాను. కొలికపూడి అపరిపక్వంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు నన్ను దేవుడని అన్నవారు, ఇప్పుడు దెయ్యమని ఎందుకు అంటున్నారో ఆయనే చెప్పాలి” అంటూ చిన్ని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఇరువురికీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.



















