‘‘శివ’’ చిత్రీకరణ రోజుల్ని, ఈ సినిమా ఇచ్చిన జ్ఞాపకాల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని కథానాయకుడు అక్కినేని నాగార్జున తెలిపారు. ‘‘36 ఏళ్లు గడిచినా ఈ సినిమాకు ఇంతటి ప్రేక్షకాదరణ దక్కుతుందనే ఊహించలేదు’’ అన్నారు. నాగార్జున – రామ్‌గోపాల్ వర్మ కలయికలో రూపొందిన ఈ విజయవంతమైన చిత్రం ఈ నెల 14న 4కే డాల్బీ ఆట్మాస్ వెర్షన్‌లో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
హీరో నాగార్జున మాట్లాడుతూ: ‘‘ఈ చిత్రాన్ని 4కే ఆట్మాస్ వెర్షన్‌లో చూసి ప్రేక్షకులు ఎంత ఆశ్చర్యపోయారో, మొన్న తొలిసారి చూసినప్పుడు నేనూ అంతే ఆశ్చర్యపోయా. కొత్త సినిమా చూస్తున్నట్లానే అనిపించింది. చిత్రం విడుదలైన రెండు రోజుల తర్వాత మా నాన్న చెప్పాడు – ‘ఇది చాలా పెద్ద హిట్ రా. చాలా బాగా చేసావు. సినిమా ఎక్కడికి వెళ్లి ఆగుతుందో నాకు తెలియదు’ అని. సినిమాలో నేను చేసిన ఛేజింగ్ సీన్స్ మళ్లీ చూసినప్పుడు, అప్పుడప్పుడు నిద్రలోనుంచి ఉలిక్కిపడి లేస్తా. ఇవన్నీ నేనే చేశానా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు.
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చెప్పారు: ‘‘సాంకేతికంగా సవాల్ అనిపించిన అంశం సౌండ్ డిజైన్. ఒరిజినల్ వెర్షన్‌లో ఉన్న ఫ్లేవర్ కోల్పోకుండా, దానిని 4కే ఆట్మాస్ వెర్షన్‌లో కూడా అంతే ప్రభావవంతంగా చూపించగలిగాము’’.




















