మచిలీపట్నం- న్యూస్‌టుడే, ఉయ్యూరు, ఉయ్యూరు గ్రామీణం: పాతికేళ్లయినా నిండని నలుగురు యువకుల ప్రాణాలను అతివేగం బలిగొంది. ఆశలన్నీ వారిపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక ఉయ్యూరు వైపునకు ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అదుపు తప్పి పక్కనున్న సర్వీసు రోడ్డుపైకి ఎక్కి సుమారు 50 మీటర్ల దూరం పల్టీలు కొట్టింది. కారు నడుపుతున్న విజయవాడ మొగల్రాజపురానికి చెందిన చాట్రగడ్డ రాకేశ్(24), అతని స్నేహితులు ఈటే ప్రిన్స్(22), గొరిపర్తి పాపారావు(23), కంకిపాడు మండలం కుందేరుకు చెందిన కొణతం చింతయ్య(19) చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాపారావు మరణించారు. వీరు సరదాగా తిరిగేందుకు వచ్చారా? ఏదైనా పనిమీద వెళ్తూ ప్రమాదానికి గురయ్యారా? స్పష్టంగా తెలియట్లేదని ఉయ్యూరు సీఐ రామారావు చెప్పారు. ప్రమాదం అర్ధరాత్రి 1.34 గంటలకు జరిగినట్లు, కారు 120 కి.మీ. వేగంతో వెళ్లినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉయ్యూరు సీహెచ్‌సీకి తరలించారు. ఆసుపత్రి వద్ద యువకుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా విలపించడం.. అక్కడి వారిని కంటతడి పెట్టించింది.



















