భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించడానికి పాక్ కుట్రలు పన్నుతున్నట్టు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం, భారత్-నేపాల్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాసాలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ప్రయత్నాలు మరింత వేగవంతమైనట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి.
నిఘా వర్గాల వివరాల ప్రకారం, ఉగ్రవాద శిక్షణ పొందే వార కోసం బంగ్లాదేశ్, నేపాల్‌లో కొత్త శిక్షణ శిబిరాలు మరియు నివాస సముదాయాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇటీవల బంగ్లా, నేపాల్ సమీప ప్రాంతాల్లోని భారత రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కార్యకర్తలను అరెస్టు చేసిన తర్వాత చేపట్టిన దర్యాప్తులో ఈ విషయాలు గుర్తించబడ్డాయి. దీనిపై భద్రత చర్యలను పెంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే, పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో ఏర్పడుతున్న ప్రాజెక్టులపై కూడా నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు.
లష్కరే తయ్యిబా (LET), జైషే మహమ్మద్ (JeM) వంటి ఉగ్ర సంస్థలు నేపాల్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అల్-ఖైదా, ఐసిస్ సంస్థలు గత ఐదు నెలలుగా బంగ్లాదేశ్‌లో తమ కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహా ప్రయత్నాల్లో పాక్‌లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్ మరియు నేపాల్‌కు నిరంతరం వలసలు జరుగుతున్నాయని కూడా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, ఉగ్రవాద శిబిరాల నిర్మాణం, నిర్వహణ కోసం కావాల్సిన నిధులు తుర్కియే నుండి అందుతున్నట్లు తెలుస్తోంది. ఢాకాలోని జమాత్-ఇ-ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకు తుర్కియే నిధులు సమకూర్చినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు.




















