శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను కాజేయడం ప్రభుత్వ నిధుల దుర్వినియోగంగా పరిగణించబడుతుందని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో తగిన సెక్షన్లతో కేసు నమోదు చేయకుండా, సాధారణ ఇంటి దొంగతనం సెక్షన్లతోనే ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. అలాగే, ఛార్జ్‌షీట్ వేసిన మరుసటి రోజే లోక్ అదాలత్‌లో కేసు రాజీ చేయడానికి కారణమేమిటి? రాజీ కోసం కేసు తీవ్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారా? అని సీఐడీ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు, డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలోని 20 మంది సీఐడీ బృందం తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో దర్యాప్తు చేపట్టింది. అప్పట్లో కేసు విచారణ చేసిన సీఐ జగన్‌మోహన్‌రెడ్డి, కేసు నమోదు చేసిన ఎస్సై లక్ష్మీరెడ్డి, అలాగే అప్పటి తితిదే భద్రతా అధికారి (వీజీవో) గిరిధర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. వారిని వేర్వేరుగా ప్రత్యేక బృందాలు ప్రశ్నించాయి. గిరిధర్ గతంలో సమర్పించిన రిపోర్టు ఆధారంగా సీఐడీ మరిన్ని వివరాలు తెలుసుకుంది. ఏవీఎస్‌వో ఫిర్యాదు, రాజీ నిర్ణయంపై ఆయనను ప్రశ్నించగా, అందరికీ సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
ఎస్సై లక్ష్మీరెడ్డిని “లోక్ అదాలత్‌లో కేసు రాజీకి ఎవరి నుంచి ఒత్తిడి వచ్చింది?”, “సెక్షన్లు మీరు స్వయంగా పెట్టారా, లేక ఎస్‌హెచ్‌వో సూచించారా?”, “సొమ్ము దుర్వినియోగం ఉన్నా ఎందుకు 409 సెక్షన్ పెట్టలేదు?”, “దాని బదులు 379, 380 ఎందుకు వాడారు?”, “దర్యాప్తులో మీరు ఎంతవరకు భాగస్వాములు అయ్యారు?” అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీఐ జగన్‌మోహన్‌రెడ్డిని సీఐడీ సుమారు నాలుగు గంటలపాటు విచారించింది. అనంతరం ఆయన మీడియాకు కనిపించకుండా వెళ్లిపోయారు. “క్రైమ్ విభాగం పోలీసులు అందుబాటులో ఉండగానే ఎందుకు వారిని దర్యాప్తులో భాగస్వాములను చేయలేదు?”, “కేవలం ఇద్దరు ముగ్గురు పోలీసులే నిందితుడి ఆస్తుల పరిశీలనకు ఎందుకు వెళ్లారు?”, “నిందితుడు రవికుమార్ కుటుంబ ఆస్తులు ఎక్కడున్నాయో మీకు తెలుసా?”, “దొంగను దాతగా చూపించి స్వామికి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించడంలో ఎవరి సూచనలు ఉన్నాయి?” వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
అదే విధంగా, రవికుమార్‌కి చెందిన 3.50 ఎకరాల భూమి బదలాయింపు పత్రాన్ని చూపించి, “ఆస్తులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై మీ స్పందన ఏమిటి?” అని కూడా ప్రశ్నించారు. సున్నితమైన ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడం గురించి అప్పటి ఎస్పీకి సమాచారం ఇచ్చారా? కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆధారాలు అదృశ్యమైన విషయంపై దర్యాప్తు చేశారా? అని కూడా ఆరా తీశారు. కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సీఐడీ అధికారులు తెలిపారు.
ఇక నిందితుడు రవికుమార్ ఆస్తుల డాక్యుమెంట్లను సేకరించేందుకు సీఐడీ బృందం చెన్నై వెళ్లింది. పరాకామణి చోరీ కేసులో మంగళవారం మరికొంత మందిని విచారించే అవకాశం ఉందని తెలిసింది.


















