ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ లూవ్రే మ్యూజియంలో చోటుచేసుకున్న భారీ దొంగతనం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. పారిస్‌లో అత్యంత భద్రత కలిగిన ఈ మ్యూజియంలోకి దుండగులు చొరబడి, కేవలం కొన్ని నిమిషాల్లోనే రూ.895 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇది అంతర్జాతీయ ముఠా పనే కాదని, చిల్లర నేరగాళ్ల చేతుల్లో జరిగిన దొంగతనమని పారిస్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
“ఈ దోపిడీని ఎలాంటి ప్రొఫెషనల్ గ్యాంగ్ లేదా కరుడుగట్టిన నేరస్థులు చేయలేదు. ఇది చిన్న చిన్న దొంగతనాలు చేసే క్రిమినల్స్ పనే,” అని పారిస్ ప్రాసిక్యూటర్ లారే బెకువా తెలిపారు. “ఈ కేసులో ఉన్న నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. వారి క్రిమినల్ రికార్డులు చూస్తే, వీరు పెద్ద నేర ముఠాకు చెందినవారు కాదని తేలింది. వీరంతా పారిస్ శివార్లలో చిన్న నేరాల్లో పాల్గొన్న వారే,” అని ఆమె వివరించారు. అరెస్టయిన వారిలో ఒకరు మహిళ అని కూడా తెలిపారు.
ఇంకా పరారీలో ఉన్న మరో అనుమానితుడిని తీవ్రంగా గాలిస్తున్నామని ఫ్రాన్స్ హోం మంత్రి లారెన్ నిజ్ చెప్పారు. ఆ వ్యక్తే ఈ దొంగతనానికి సూత్రధారి అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చోరీ తర్వాత దుండగులు వజ్రాల కిరీటాన్ని, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు, గ్లౌజులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఇది పెద్ద ముఠా చేసిన ప్రణాళికాబద్ధమైన దోపిడీ కాదని అధికారులు తేల్చారు. అరెస్టయిన ఇద్దరు అనుమానితులు ఈ దొంగతనంలో తమ పాత్ర ఉందని అంగీకరించినట్లు సమాచారం.
అక్టోబర్ 19న లూవ్రే మ్యూజియంలో ఈ దోపిడీ జరిగింది. ఆ సమయంలో మ్యూజియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దుండగులు ఆ ప్రాంతం ద్వారా లోపలికి చొరబడి, సరుకు రవాణా కోసం ఉన్న ఎలివేటర్ ద్వారా అపోలో గ్యాలరీకి చేరుకున్నారు. అక్కడ నెపోలియన్ కాలానికి చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు ప్రదర్శనలో ఉన్నాయి. గ్యాలరీ గాజు అద్దాలను పగలగొట్టి, దుండగులు తొమ్మిది విలువైన వస్తువులను దోచుకున్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఒక ఆభరణం మ్యూజియం బయట పడిపోయింది. మిగతా ఆభరణాల మొత్తం విలువ సుమారు 88 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో రూ.895 కోట్లు)గా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రారంభంలో ఈ చోరీ వెనుక ప్రసిద్ధ “పింక్ పాంథర్స్” గ్యాంగ్ ఉందని అనుమానాలు వ్యక్తమైనా, దానికి సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.




















