మోస్తరు ప్రీమియంతో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఫిన్‌టెక్ సంస్థ పైన్‌ల్యాబ్స్.. లిస్టింగ్ తర్వాతనే షేర్లు దూసుకెళ్లాయి. షేర్ల ఇష్యూ ధర రూ.221గా నిర్ణయించగా, 9.5 శాతం ప్రీమియంతో షుక్రవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో రూ.242 వద్ద లిస్టయ్యాయి. లిస్టింగ్ తరువాత షేర్లు 28 శాతం పెరిగి ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.284ను తాకాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు 17 శాతం లాభంతో రూ.260 వద్ద ట్రేడవుతున్నాయి. కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.31,118 కోట్లుగా ఉంది.
రూ.3,900 కోట్లు మార్కెట్ నుండి సమీకరించేందుకు ప్రారంభమైన పైన్‌ల్యాబ్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 7న ముగిసింది. షేర్ల ధర శ్రేణి రూ.210-221గా నిర్ణయించగా, మొత్తం 2.46 రెట్లు సబ్‌స్క్రిప్షన్ దొరికింది. రూ.2,080 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా, 8.23 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయానికి ఉంచారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను ప్రధానంగా విదేశీ అనుబంధ సంస్థల్లో పెట్టుబడులకు వినియోగించనున్నారు. ఫిన్టెక్ రంగంలో పేటీఎం, రేజోర్ పే, పేయూ పేమెంట్స్, ఫోన్‌పే వంటి సంస్థలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.




















