భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) గురించి చాలా మందికి చంద్రయాన్, ఆదిత్య-L1 వంటి భారీ అంతరిక్ష ప్రయోగాలు మాత్రమే గుర్తుండవచ్చు. కానీ ISROకి చెందిన అనేక భూవీక్షణ ఉపగ్రహాలు (Earth Observation Satellites) రోజూ మన పల్లెలను, పట్టణాలను గమనిస్తూ, కీలక సమాచారాన్ని పంపుతున్నాయి. ఈ సమాచారాన్ని వ్యవసాయం నుంచి మురుగునీటి పారుదల వరకు విస్తృతంగా ఉపయోగించవచ్చు.
ఉపగ్రహాలు పంటల ఆరోగ్యం, విస్తీర్ణం, భూ వినియోగాన్ని పర్యవేక్షిస్తాయి. LISSS-3, 4 వంటి హైరిజల్యూషన్ కెమెరాలు వెజిటేషన్ ఇండెక్స్ (NDVI) డేటాను సేకరించి, రైతులకు యాప్‌ల ద్వారా అందిస్తాయి. ఏ పొలంలో నీటి శాతం తక్కువగా ఉందో, ఎక్కడ తెగులు వచ్చే ప్రమాదం ఉందో ముందే తెలుసుకుని నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వర్షపాతం అంచనాలు, చెరువులు, రిజర్వాయర్లలో నీటి స్థాయిలు కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.
కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహాలు
కార్టోశాట్ ఉపగ్రహాలు భూమిని 600–800 కిలోమీటర్ల ఎత్తులో గమనిస్తాయి. 25 సెం.మీ. కంటే పెద్దగా ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా గుర్తించగలవు. వీటితో రోడ్లపై కారు, లారీ, పొలంలోని మట్టిని కూడా తెలుసుకోవచ్చు.
అక్రమ నిర్మాణాల పర్యవేక్షణ:
కార్టోశాట్-2, 3 ఉపగ్రహాలు సెంటీమీటర్ల స్థాయిలో వివరాలను అందిస్తాయి. భౌగోళిక మార్పులు, కొత్త నిర్మాణాల విస్తీర్ణం గుర్తించడానికి ఇవి ఉపయోగిస్తారు. LISSS-4 కెమెరా అందించే 5.8 మీటర్ల రిజల్యూషన్ చిత్రాలు కొత్త రోడ్ల ప్రణాళిక, పట్టణ మ్యాపింగ్‌కి కీలకంగా మారాయి.
ప్రతీ 3–6 నెలలకొకసారి మున్సిపల్ అధికారులు ఉపగ్రహ చిత్రాలను పాత చిత్రాలతో పోల్చి, కొత్త భవనాలు, ఆక్రమణలను గుర్తిస్తారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నది పరివాహక ప్రాంతాలను జియోఫెన్సింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. సరిహద్దులలో కొత్త నిర్మాణాలు “అక్రమ నిర్మాణం”గా గుర్తించబడతాయి.
ఉపగ్రహాల కొద్దిపాటి ఉదాహరణలు:
- 2016లో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో కార్టోశాట్-2C ఉపగ్రహం భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల బంకర్లను గుర్తించి సైన్యానికి మార్గనిర్దేశం చేసింది.
- 2024 జులైలో కేరళలోని వయనాడ్ కొండచరియల ప్రమాదానికి ముందు కార్టోశాట్-3, RISAT ఉపగ్రహాలు మట్టిచలనం గుర్తించి అంచనా సూచనలు ఇచ్చాయి.
తిరుమలలో తరచూ కొండచరియలు చోటు చేసుకుంటాయి. ISRO లైట్స్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (LiDAR) టెక్నాలజీని ఉపయోగించి, లేజర్ కిరణాల ద్వారా 3D మ్యాపింగ్ చేసి, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించింది. ఈ ఆధారంతో ప్రభుత్వాలు భద్రతా పనులు చేపడతాయి.
ISRO డేటా ప్రజలకు అందుబాటులో
ISRO మూడు పోర్టల్‌ల ద్వారా ఉపగ్రహ డేటాను అందిస్తుంది:
- భువన్: మన స్వదేశీ గూగుల్ ఎర్త్. గ్రామాలు, రోడ్లు, చెరువులు హైరిజల్యూషన్‌లో చూడవచ్చు.
- సఫర్: ఏ గ్రామంలోనైనా గాలి నాణ్యత (AQI), కాలుష్యం, వాతావరణ మార్పులను తెలుసుకోవచ్చు.
- వేదాస్: రైతులకు ప్రత్యేకం. పంట ఆరోగ్యం, భూ సార పరీక్షలు, సాగు పరిస్థితులను తెలుసుకోవచ్చు.
ఇలా, ISRO ఉపగ్రహాలు ప్రతి రోజూ మన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తూ, భౌగోళిక, వ్యవసాయ, భద్రతా రంగాల్లో కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నాయి.



















