ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఉద్యోగుల ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు కొత్తగా ‘ఎస్‌బీఐ స్టార్ అవార్డులు’ ప్రారంభించింది. ఈ అవార్డుల ద్వారా కేవలం ఉద్యోగ బాధ్యతలలోనే కాకుండా కళలు, సాహిత్యం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవలు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులను గౌరవించనుంది.
ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంపొందించి, సంస్థ పట్ల అనుబంధాన్ని బలపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఎస్‌బీఐ తెలిపింది. ఈ అవార్డుల ఆవిష్కరణ సందర్భంగా ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ, “ఉద్యోగుల వృత్తిపరమైన ప్రతిభతో పాటు వారి వ్యక్తిగత విజయాలు, ఆసక్తులు, సమాజానికి చేసిన కృషిని కూడా గుర్తించి అభినందించడం అవసరం. బహుముఖ ప్రజ్ఞ కలిగిన మా ఉద్యోగులు సమాజంలో మార్పు తీసుకువస్తారన్న నమ్మకాన్ని ఈ కార్యక్రమం బలపరుస్తుంది” అని అన్నారు.
అలాగే ఎస్‌బీఐలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతిభ కనబరిచిన అనేకమంది ఉద్యోగుల ఉదాహరణలు ఉన్నాయని ఆయన తెలిపారు. వీరిలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ఎదిగిన ప్రతీక్షా టొండ్‌వాల్కర్, చూపు లేని పరిస్థితుల్లోనూ సహోద్యోగులకు స్ఫూర్తిగా నిలిచిన సన్వలి, 71 ఏళ్ల వయసులో చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలో విజయం సాధించిన తారాచంద్ అగర్వాల్, అలాగే భారత అంధుల క్రికెట్ జట్టును ఐదు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిపిన కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి వంటి వారిని శెట్టి ప్రస్తావించారు.
ఉద్యోగుల ప్రతిభ సంస్థ అభివృద్ధికి, కొత్త ఆవిష్కరణలకు దోహదపడుతుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ అవార్డులను పారదర్శకమైన విధానంలో అందించనున్నారు. ఉద్యోగులు స్వయంగా తమను నామినేట్ చేసుకునే అవకాశం ఉండగా, ప్రతి సర్కిల్ లేదా విభాగం స్థాయిలో మదింపు జరిపి తుది జాబితాను రూపొందించనున్నారు. చివరగా, ముంబయి కార్పొరేట్ కార్యాలయం నుండి తుది ఫలితాలు విడుదల చేయబడతాయి.




















