పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని సుంకరపద్దయ్య వీధిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన తల్లి, తమ్ముడిని కత్తితో దాడి చేసి హతమార్చాడు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం — గునుపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతూ, తల్లి మహాలక్ష్మి (60), తమ్ముడు రవితేజ (33)తో కలిసి నివసిస్తున్నాడు.
సోమవారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా, శ్రీనివాసరావు అకస్మాత్తుగా కత్తి తీసుకుని తల్లి, తమ్ముడిపై దాడి చేశాడు. వారు తప్పించుకునేలోపే ఘోరంగా నరికేసి అక్కడికక్కడే మృతి చెందేలా చేశాడు. అనంతరం సుమారు గంట తర్వాత శ్రీనివాసరావే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




















