ఈనాడు – కడప / న్యూస్‌టుడే – ములకలచెరువు / మదనపల్లె:
అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు బెంగళూరుకు చెందిన తండ్రీకుమారులు కావడం విశేషం. ప్రధాన నిందితుడు జనార్దనరావుకు స్పిరిట్ సరఫరా చేయడం, నకిలీ మద్యం ఫార్ములా తయారీలో సాయం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు.
శనివారం అర్ధరాత్రి ములకలచెరువు పోలీసులు బెంగళూరులో వారిని అరెస్టు చేసి, ఆదివారం తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల న్యాయ రిమాండ్ విధించడంతో, వారిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.
తెలంగాణ, గుజరాత్, బెంగళూరు ప్రాంతాల నుంచి పరికరాలు తెచ్చి నకిలీ మద్యం తయారీలో ఉపయోగించినట్లు విచారణలో బయటపడింది. స్పిరిట్‌ను బాలాజీ (A15) సరఫరా చేయగా, ఆయన కుమారుడు సుదర్శన్ (A20) ఫార్ములా తయారీలో సహకరించాడు.
బాలాజీ 2010 నుంచి గోవాలోని కళింగర్ ప్రాంతంలో మద్యం వ్యాపారం చేస్తున్నాడు. కరోనా సమయంలో నష్టాలు చవిచూసాడు. 2023లో గోవాకు వెళ్లిన ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ యజమాని జనార్దనరావుతో పరిచయం ఏర్పడింది. నకిలీ మద్యం తయారీ ప్రణాళికలో భాగంగా బాలాజీని ఆహ్వానించగా, అతడు అంగీకరించాడు.
బాలాజీకి పరిచయమైన జీనేష్ అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి స్పిరిట్ తెప్పించుకుని, బెంగళూరు సమీపంలోని నెలమంగళిలో నిల్వ చేసేవారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా ఇబ్రహీంపట్నానికి తరలించేవారు.
గుజరాత్‌కు చెందిన వాలరం, అతని కుమారుడు శరవణ బెంగళూరులోని సిల్క్‌బోర్డ్ ప్రాంతంలో ఉండి నకిలీ మద్యానికి అవసరమైన సీసాల మూతలు కొనుగోలు చేశారు. బ్రాండ్ లేబుళ్లను హైదరాబాద్‌కు చెందిన నకిరేకంటి రవి గోవాలో ఉన్న తన పరిచయ ప్రింటర్ ద్వారా ముద్రించినట్లు బాలాజీ విచారణలో ఒప్పుకున్నాడు.
సుదర్శన్ ఓ డిస్టిలరీలో పని చేసిన అనుభవంతో మద్యం తయారీ పద్ధతులు బాగా తెలిసి ఉండటంతో తండ్రితో కలిసి జనార్దనరావు ఆధ్వర్యంలో పని చేశాడు. వీరు ములకలచెరువుకు స్పిరిట్, పరికరాలు పలు దఫాల్లో సరఫరా చేశారు.
పోలీసులు నిందితుల నుంచి రెండు కార్లు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.



















