మాదకద్రవ్యాల నుంచి కశ్మీర్‌ను విముక్తం చేయడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. హింసారహిత సమాజం, వ్యాధులేనిదైన శరీరం, గందరగోళం లేని మనసు, దుఃఖ రహిత ఆత్మ—ఇవి ప్రతి ఒక్కరి జన్మహక్కులన్నీ ఆయన పేర్కొన్నారు. ఈనెల 11న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ బక్షి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఎడ్యూ యూత్- డ్రగ్ ఫ్రీ కశ్మీర్’ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 50 కళాశాలలు, 4 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 20,000కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వారితో కలసి శ్రీశ్రీ రవిశంకర్ మాదకద్రవ్య రహిత భవిష్యత్తుకు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీ రవిశంకర్ కశ్మీర్‌ను ప్రాచీన జ్ఞానభూమిగా వివరించారు. ఇక్కడి యువత చైతన్యవంతులని, పూర్తి సామర్థ్యం కలిగివుండారన్నారు. శ్వాస, ధ్యానం, వ్యాయామాల ద్వారా మాదకద్రవ్య వ్యసనం నుండి సులభంగా విముక్తి పొందవచ్చని వివరించారు. ధ్యానం కేవలం కశ్మీర్‌కు మాత్రమే పరిమితం కాదని, మనసును ఆనందంతో నింపుతుందని అన్నారు. అలాగే, ధ్యానానికి ఏ మత విశ్వాసంతో సంబంధం లేదని చెప్పారు.
తర్వాత జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో శ్రీశ్రీ రవిశంకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక కార్యక్రమాలు, యువత భవిష్యత్తు అంశాలపై చర్చించేందుకు ఆయన పలువురు స్థానిక ప్రముఖులను కలిశారు.




















