గుంటూరు: ఆంధ్రప్రదేశ్ బిలియర్డ్స్ & స్నూకర్ అసోసియేషన్ మరియు ఎల్వియర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్ & స్నూకర్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌కి ఈ రోజు గుంటూరులోని ఎల్వియర్ క్లబ్ వేదికైంది. ఈ టోర్నమెంట్‌ను శాప్ చైర్మన్ శ్రీ అనిమిని రవి నాయుడు గారు ఘనంగా ప్రారంభించారు.
ప్రారంభ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సి. ఇంద్రనీల్ గారు, సుశీల్ గారు, వెంకటేశ్వరరావు గారు, శాప్ బోర్డు డైరెక్టర్ సంతోష్ గారు, గుంటూరు టిడిపి సీనియర్ నాయకులు మళ్లీ బాబు గారు మరియు టిఎన్ఎస్ఎఫ్ గుంటూరు అధ్యక్షులు వంశీకృష్ణ గారు పాల్గొన్నారు.
ఈ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండి 210 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు పాల్గొంటున్నారు. ర్యాంకింగ్ టోర్నమెంట్‌గా నిర్వహించబడుతున్న ఈ పోటీలు రాష్ట్రస్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే కాకుండా జాతీయ స్థాయికి ప్రతినిధులను ఎంపిక చేయడానికీ దోహదపడనున్నాయి.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఇలాంటి టోర్నమెంట్లు యువ క్రీడాకారులలో పోటీ ఆత్మను పెంపొందిస్తాయని, రాష్ట్రంలో బిలియర్డ్స్ & స్నూకర్ క్రీడలకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సహాయపడతాయని తెలిపారు.




















