తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో భారీ వర్షాల ప్రభావంతో పెద్దకాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీతో పాటు పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్ల చుట్టూ వరదనీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోనూ బురద కాలువ పొంగిపొర్లి ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ –
“గత రాత్రి ఏజెన్సీ గంగవరం ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. గోకవరం మరియు పరిసర కాలనీల్లో నీరు నిలిచిపోయింది. వరదనీరు సులభంగా బయటకు వెళ్లేందుకు తక్షణ చర్యలు తీసుకుంటాం. కాలువలను వెడల్పు చేయడం, అడ్డంకులైన లేఔట్లను తొలగించడం వంటి పనులు ప్రారంభిస్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ చర్యలు చేపడతాం,” అని తెలిపారు.
కలెక్టర్ ఇంకా పేర్కొంటూ –
“తుపాను తర్వాత సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. జిల్లాలో దాదాపు 10,000 హెక్టార్లలో వరి పంట నేలమట్టమైంది. మరో 2,000 హెక్టార్లలో పంట ముంపులో చిక్కుకుంది,” అని చెప్పారు.
స్థానిక అధికారులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.


















