దిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోతోందని ఓ అధ్యయనం తెలిపింది. హిమాలయ ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో సగటున ఏడాదికి సూర్యరశ్మి పడే సమయం క్రమంగా తగ్గి, వరుసగా 9.5 గంటలు, 8.5 గంటల వరకు చేరిందని వివరించారు. 1988 నుండి 2018 మధ్య 20 వాతావరణ కేంద్రాల డేటాను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ, భారత వాతావరణ విభాగం ఇందులో పాలుపంచుకున్నారు. వివరాల ప్రకారం, దక్కన్ ప్రాంతంలో సూర్యరశ్మి పడే సమయం ఏడాదికి 3 గంటలు, ఉత్తరభారతంలో 1.5 గంటలు తగ్గింది. పరిశోధకులు దీన్ని “సోలార్ డిమ్మింగ్”గా వివరించారు. వాహనాలు, కర్మాగారాల నుండి విడుదలయ్యే సూక్ష్మ ఏరోసోల్ కణాలు వాతావరణంలో వ్యాపించి సూర్యరశ్మి భూఉపరితలానికి చేరకుండా నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. 1990 తర్వాత ఈ పరిస్థితి బాగా పెరిగింది. దీని కారణంగా దేశ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించలేకపోవచ్చని, సోలార్ డిమ్మింగ్ దుష్ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు అవసరమని అధ్యయనంలో సూచించారు.




















