భార్యా బిడ్డలను వదిలేసిన భర్త తన చర్యల ఫలితాలను అనుభవించక తప్పదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాకినాడ జిల్లాకు చెందిన ఒక సీనియర్ ట్రావెలింగ్ ఇన్‌స్పెక్టర్ నుంచి తగిన భరణం ఇవ్వాలని కోరుతూ భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ సందీప్ మెహతా లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
భర్త తనను, ఇద్దరు బిడ్డలను వదిలేశాడని పేర్కొన్న బాధితురాలు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున, మొత్తం రూ.30 వేల భరణం కోరగా, కింది కోర్టు ఒక్కో బిడ్డకు రూ.6 వేల చొప్పున మాత్రమే నిర్ణయించింది. ఈ తీర్పును హైకోర్టు కూడా సమర్థించడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం నెలకు మొత్తం రూ.25 వేల భరణం చెల్లించాలని ఆదేశించింది. భర్త తరఫున న్యాయవాది మాట్లాడుతూ తనకు తల్లి, మతిస్థిమితం లేని సోదరి ఉన్నారని, వారి సంరక్షణ కూడా తానే చూసుకోవాల్సి ఉంటుందని, అలాగే భార్య పేరిట పొలం, ఇల్లు ఉన్నందున భరణం పెంచరాదని వాదించారు.
అయితే న్యాయమూర్తులు ఆ వాదనలను తిరస్కరించారు. 15 ఏళ్ల పిల్లలకు రూ.6 వేల చొప్పున ఇస్తే సరిపోదని, అంత మొత్తంలో యూనిఫాం ఖర్చుకూడా కష్టమని పేర్కొన్నారు. ‘‘మీరు భార్యా బిడ్డలను వదిలేసినప్పుడు దాని పరిణామాలను తప్పక ఎదుర్కోవాలి. తల్లి తర్వాత భార్యా పిల్లలకే ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నెలకు రూ.1.16 లక్షల వేతనం పొందుతున్న భర్త రూ.25 వేల భరణం చెల్లించడం తగినదేనని, ప్రతి సంవత్సరం 5% చొప్పున పెంచుతూ చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది.




















