తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రకారం, 2047 నాటికి రాష్ట్రాన్ని పచ్చదనం పరిపూర్ణం, జీవవైవిధ్య సంపన్నంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ దిశగా ‘విజన్ 2047’లో అటవీ విస్తరణ, వన్యప్రాణుల సంరక్షణ, నదుల పునరుజ్జీవం, జీవవైవిధ్యం తదితర కీలక కార్యక్రమాలను ప్రతిపాదించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రూపొందించిన ముసాయిదా నివేదికలో వీటికి ప్రాధాన్యతనివ్వగా, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం, పచ్చదనం పెంపు, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రధాన సంకల్పంగా పేర్కొన్నారు.
నదులు, ఉపనదుల పునరుజ్జీవం:
2047 విజన్‌లో రాష్ట్రంలోని ప్రధాన నదులు గోదావరి, కృష్ణలతో పాటు ఉపనదుల పునరుజ్జీవానికి ప్రాధాన్యం ఇవ్వబడింది. నది తీరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, అటవీ ప్రాంతాలను రక్షించడం వంటి లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి.
టైగర్ కారిడార్ల అభివృద్ధి:
దశాబ్దాలుగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు స్వేచ్ఛగా సంచరిస్తున్న మార్గాల్లో ఇప్పుడు అవరోధాలు ఏర్పడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు, వ్యవసాయం, నివాసాలు వంటి కారణాల వల్ల పులుల రాకపోకలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర-తెలంగాణ, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో టైగర్ కారిడార్లను పునరుద్ధరిస్తారు. అదనంగా, పెద్దపులులు సంచరిస్తున్న ఇతర ప్రాంతాల్లో కొత్త కారిడార్లను గుర్తించి అధికారికంగా నోటిఫై చేస్తారు.
గడ్డి భూములకు జీవం:
ప్రధానంగా దక్షిణ జిల్లాల్లో వేల ఎకరాల్లో ఎండిపోయిన గడ్డి భూములను పునరుజ్జీవింపచేయడానికి ప్రణాళిక రూపొందించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి మరియు మరికొన్ని జిల్లాల్లో దేశీయ గడ్డి జాతుల మొక్కలు నాటబడతాయి. ఇది పశువులకు ఎక్కువ మేత అందించడానికి సహాయపడుతుంది.
వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ:
మంజరి, కిన్నెరసాని, పోచారం వంటి వెట్‌ల్యాండ్‌లను ఆక్రమణ, కాలుష్యం, నగర విస్తరణల కారణంగా నష్టపోయాయి. వీటి పునరుజ్జీవానికి ప్రత్యేక చర్యలు చేపడతారు.
22 ఏళ్లలో అటవీ విస్తీర్ణాన్ని 25% పెంచడం:
ప్రస్తుతానికి రాష్ట్ర భూభాగంలో 25% అటవీ భూమి మాత్రమే ఉంది. 2050 నాటికి దీన్ని 50%కి పెంచాలని లక్ష్యంగా పెట్టినప్పటికీ, ‘విజన్ 2047’ ప్రకారం ఈ లక్ష్యాన్ని మూడేళ్ల ముందే, అంటే 2047 నాటికి చేరుకోవాలని ప్రతిపాదించారు. 2015 నుంచి ఇప్పటివరకు 260 కోట్ల మొక్కలు నాటారు. ఇంకా 100 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం సంకల్పించింది. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరిస్తారు.


















