‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం కింద నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు చొప్పున జమ చేయనుంది. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులను విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46.86 లక్షలమంది కర్షకులకు ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున మొత్తం రూ.3,135 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. గత ఆగస్టులో ఇదే పథకం కింద తొలి విడతగా రూ.3,174 కోట్లు విడుదల కాగా, ఇప్పటివరకు రెండు విడతల్లో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.6,309.44 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు.
రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం
నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 10 వేలకుపైగా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. నిధుల జమతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రవేశపెడుతున్న పలు కార్యక్రమాలను, అగ్రిటెక్ వినియోగం, ఆదరణ గల పంటల సాగు, మార్కెట్ సదుపాయాల మెరుగులు, ప్రకృతి సేద్యం, భూసార పరీక్షలు, పంటలకు ఆహారశుద్ధి తదితర అంశాలను రైతులకు వివరించేలా ప్రసారం ఉండాలని సూచించారు.
రైతుల ఫోన్లకు ముందస్తుగా సమాచారం పంపండి: అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం: నిధుల విడుదలకు ముందు రోజే రైతుల ఫోన్లకు సమాచారం పంపించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, రైతుల సందేహాలకు సహాయం చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉండాలని సూచించారు. అర్హులైన రైతులు మరణించిన సందర్భంలో వారసులకు డెత్ మ్యుటేషన్ చేసి పథకం లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని, తొలి విడతలో డబ్బు రాని రైతుల ఫిర్యాదులను పరిశీలించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా నిధులు అందేలా చూస్తామని తెలిపారు.



















