అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీలో తమ స్వంత క్వాంటమ్ కంప్యూటర్ను అమర్చనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ సంస్థ ‘పాస్కల్’ ఆసియా–పసిఫిక్ సీఈవో రాబర్టో మావ్రో వెల్లడించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాస్కల్ కుదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యాంశాలు ఇవీ:
భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు మంచి అవకాశం
న్యూట్రల్-ఆటమ్ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో పాస్కల్ ఒకటి. సహ వ్యవస్థాపకుల్లో ఒకరు నోబెల్ బహుమతి గ్రహీత కావడం కంపెనీ ప్రతిష్ఠను మరింత పెంచిందని మావ్రో తెలిపారు. ఫ్రాన్స్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ సంస్థ కెనడా, ఉత్తర అమెరికా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ రూపకల్పన, దాని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలు తమను ఆకట్టుకున్నాయని, భారతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది పెద్ద అవకాశం అని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వ్యూహం సిద్ధం
క్వాంటమ్ కంప్యూటింగ్‌కు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో తమకున్న నైపుణ్యాన్ని వివరించిన ఆయన, న్యూట్రల్-ఆటమ్ ఆధారిత క్వాంటమ్ కంప్యూటర్ల డిజైన్, తయారీ పూర్తిగా పాస్కల్ సొంతమని చెప్పారు. అమరావతిలో తమ కార్యకలాపాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భారత భాగస్వాములతో కలిసి అప్లికేషన్లు, హైబ్రిడ్ అల్గారిథమ్‌లు అభివృద్ధి చేయడం, క్వాంటమ్ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడం, భారత క్వాంటమ్ సరఫరా గొలుసులో అవసరమైన భాగాలు తయారు చేయడం వంటి చర్యలు దశలవారీగా చేపట్టనున్నట్లు తెలిపారు.
పెట్టుబడిపై త్వరలో స్పష్టత
పెట్టుబిడి పరిమాణాన్ని ఇప్పుడే వెల్లడించడం సాధ్యం కాదని మావ్రో అన్నారు. కెనడా, అమెరికా, దక్షిణ కొరియాలో స్థానిక భాగస్వామ్యంతో ప్రాజెక్టులను అమలు చేసిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. భారత భాగస్వామి ఖరారైన తర్వాత పెట్టుబడికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. నైపుణ్యం గల మానవ వనరులు, ప్రభుత్వ నిబద్ధత, ప్రాజెక్టులో ప్రముఖ సంస్థల భాగస్వామ్యం తమను ఆకట్టుకున్నాయన్నారు.
అమరావతికి ప్రత్యేకంగా క్వాంటమ్ కంప్యూటర్
ఇప్పటికే మూడు క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేసి ఫ్రాన్స్, జర్మనీ కంప్యూటింగ్ కేంద్రాలకు, సౌదీ ఆరామ్కోకు సరఫరా చేసినట్లు రాబర్టో తెలిపారు. ప్రస్తుతం మరిన్ని రెండు యూనిట్లు తయారవుతున్నాయి. వీటి తర్వాత అమరావతిలో ఏర్పాటు చేయడానికి ప్రత్యేక క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేస్తామని చెప్పారు. ఈ కంప్యూటర్ను పాస్కల్ సంస్థే నేరుగా నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లు పాస్కల్ ప్రైవేట్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ ద్వారా సేవలు పొందవచ్చని, త్వరలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారానూ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.




















