ఎయిర్ ఇండియాకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థలో మైనారిటీ వాటా కలిగిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, తన ప్రధాన భాగస్వామి టాటా సన్స్‌తో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను రూ.10,000 కోట్ల సహాయం కోరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిసి ఎయిర్ ఇండియాలో రూ.9,558 కోట్ల పెట్టుబడులు పెట్టగా, ఈ ఏడాది మార్చిలో మాత్రమే ప్రమోటర్లు రూ.4,306 కోట్లు సమకూర్చారు.
నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఇటీవల పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోవడంతో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అదనంగా, పాకిస్థాన్ గగనతలం భారతీయ విమానాలకు మూసివేయడంతో ఎయిర్ ఇండియాకు దాదాపు రూ.4,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా.




















