ఈటీవీ భారత్: చదువులో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర బస్తర్ జిల్లా ముసుర్‌పుట్ట గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోర్డు పరీక్షల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం అవకాశం ఇస్తున్నారు. ఈ ప్రయాణ ఖర్చును గ్రామ అధికారులు, ఉద్యోగులు భరిస్తున్నారు. ప్రతి సంవత్సరం పది లేదా 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేస్తారు. గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న డి.కె. భాస్కర్ 2013లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 13 సంవత్సరాల్లో సుమారు 50 మంది విద్యార్థులు విమానంలో ప్రయాణించారని తెలిపారు.




















