దిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌లు ఇక్కడి సంవిధాన్ సదన్‌లో నివాళులు అర్పించారు. తొలి దళిత స్పీకర్‌గా రికార్డు సృష్టించిన ఆయన తన పనితీరుతో అందరి మనసులనూ గెలుచుకున్నారని శ్లాఘించారు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఒకటైన లోక్‌సభ స్పీకర్ పదవిని అలంకరించడం ద్వారా బాలయోగి దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పారని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. నిరాడంబర జీవనశైలితో అందరి మనసులను గెలుచుకున్న ఆయన భారత పార్లమెంటరీ చరిత్రలోనే కాకుండా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
బాలయోగి సేవలు ఆదర్శనీయం: చంద్రబాబు
అమరావతి: దివంగత గంటి మోహనచంద్ర బాలయోగి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి ఆదర్శవంతమైన సేవలు అందించారంటూ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. బాలయోగి దేశ రాజకీయాల్లో తెలుగు వారి సత్తా చాటారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.




















