అమెరికా శ్వేతసౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన అనంతరం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు. పేద మరియు అభివృద్ధి చెందని దేశాల నుంచి అమెరికాకు వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా అమెరికా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. అలాగే, వలసదారులకు అందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు మరియు ఫెడరల్ ప్రయోజనాలను నిలిపివేస్తామని తెలిపారు.
‘‘మేం టెక్నాలజీగా ముందుకు సాగుతున్నా, ప్రస్తుత వలస విధానం దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను పూర్తిగా నిలిపివేస్తాం. జో బైడెన్ సంతకం చేసిన అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తాం. అమెరికాను ప్రేమించని, దేశానికి భారం అయ్యే వారిని వెనక్కి పంపిస్తాం. విదేశీ పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు నిలిపివేస్తాం. దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిని బహిష్కరిస్తాం’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం శ్వేతసౌధానికి సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నేషనల్ గార్డ్‌కు చెందిన ఓ మహిళ సైనికురాలు మృతిచెందగా, మరోకరు గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి అఫ్గాన్ వలసదారుడని, సీఐఏ మద్దతుతో పనిచేసిన ప్రత్యేక దళంలోని మాజీ సభ్యుడని అధికారులు తెలిపారు. ఈ సంఘటన అనంతరం ట్రంప్ వలస విధానంపై మరింత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
అమెరికా అధికారులు అఫ్గానిస్తాన్‌తో పాటు మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా పునర్మూల్యాంకనం చేయనున్నారు. థర్డ్ వరల్డ్ దేశాలుగా పిలిచే దక్షిణ సూడాన్, సోమాలియా, నైజర్, అఫ్గానిస్తాన్, పాక్, సిరియా, ఉగాండా వంటి తక్కువ ఆదాయం కలిగిన దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.




















