ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో ఆయన కలప, ఫర్నిచర్‌పై టారిఫ్ బాంబు విధించడం ఆందోళన రేకెత్తించింది. అయితే, ట్రంప్ తాజాగా విధించిన సుంకాల కారణంగా భారత్ కు లాభమేనని గ్లోబల్ ట్రేడ్, రీసెర్చ్ ఇనిషియేటివ్ తన విశ్లేషణలో పేర్కొంది.
కలపపై 10 శాతం, కిచెన్ క్యాబినెట్‌లు, బయటి దేశాల్లో తయారయ్యే ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇవి అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఇతర వస్తువులపై 50 శాతం టారిఫ్ లు ఉన్న సంగతి తెలిసిందే. సెక్షన్ 232 ప్రకారం.. ఇప్పటివరకు భారత ఫర్నిచర్‌పై ఉన్న 50 శాతం నుంచి 10-25 శాతం మాత్రమే సుంకాలు అమలుకానున్నట్లు జీటీఆర్‌ఐ పేర్కొంది. ఇది భారత్‌కు పెద్ద ఉపశమనం అని జీటీఆర్‌ఐకి చెందిన అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఫర్నిచర్, కిచెన్ క్యాబినెట్‌లపై సుంకాలు తగ్గుతుండటంతో అమెరికన్ కొనుగోలుదారులకు భారత దిగుమతులే ప్రత్యామ్నాయంగా మారొచ్చన్నారు.
ఇదిలాఉండగా.. టారిఫ్‌ల నేపథ్యంలో అమెరికా పలు దేశాలతో విడిగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకొంటున్న సంగతి తెలిసిందే. ఫర్నిచర్‌పై ట్రంప్ తాజా ప్రకటనతో యూకేపై 10 శాతం, ఈయూ, జపాన్‌లపై 15 శాతం ప్రభావం పడనుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఫర్నిచర్‌పై 654.8 మిలియన్ డాలర్ల ఎగుమతి జరగనుంది. ఇందులో కిచెన్ క్యాబినెట్‌లు 568.3 మిలియన్ డాలర్లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 83.3 మిలియన్ డాలర్లు, సాఫ్ట్‌వుడ్ కలపపై 3.2 మిలియన్ డాలర్లు ఉన్నాయి. తాజా టారిఫ్‌లు వీటన్నింటిపైనా ప్రభావం చూపనున్నాయి.




















