తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30 నుంచి 2026 జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ దర్శనాల కోసం ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో టోకెన్లు జారీ చేయడానికి విధానాలను మరో వారంలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి దర్శన టికెట్ల జారీ, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు, ప్రివిలేజ్ దర్శనాల కోసం ప్రత్యేక కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా మెరుగైన విధానాలను అమలు చేయడానికి తితిదే బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. అలాగే ఏఐ సాంకేతికతను వినియోగించే ప్రయత్నాలు ఉంటాయని తెలిపారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తొమ్మిది రకాల సేవలు భక్తులకోసం అందుబాటులో ఉంటాయని ఈవో సింఘాల్ తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణ, కంపార్ట్‌మెంట్ల పర్యవేక్షణ, ప్రతి భక్తి డేటా సేకరణకు ఈ సెంటర్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుంచి 25 వరకు కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
తిరుమల అటవీ ప్రాంతంలో రాబోయే పదేళ్లలో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు, పచ్చదనం పెంపొందించేందుకు ఇటీవల తితిదే బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
అమరావతి పరిధిలోని వెంకటపాలెం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతాయని ఈవో తెలిపారు.




















