ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర మాడ్యూల్‌కు (ఫరీదాబాద్ ఉగ్రకుట్ర మాడ్యూల్) విదేశీ సంబంధాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తుర్కీ దేశంలోని ‘ఉకాసా (Ukasa)’ అనే హ్యాండ్లర్‌తో ఈ మాడ్యూల్ టచ్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ వివరాలు మీడియా ద్వారా వెల్లడయినాయి.
ఉకాసా అనే పేరు అరబిక్‌లో ‘స్పైడర్’ అర్థం. ఫరీదాబాద్ మాడ్యూల్, ఉగ్రసంస్థ జైషే మహ్మద్, అన్సర్ ఘజ్వత్- ఉల్‌హింద్ వంటి సంస్థల నిర్వాహకులు ఈ ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ ఉమర్ సహా అతడి సహచరులు ఉకాసా హ్యాండ్లర్‌తో చర్చించారని నిఘా వర్గాలు గుర్తించాయి.
2022లో డాక్టర్ ఉమర్ (Dr. Umar Un Nabi) తుర్కీలో పర్యటించిన సమయంలో అంకారాలో రెండు వారాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయంలో హ్యాండ్లర్ కూడా అంకారాలో ఉంటుందని అనుమానిస్తున్నారు. అక్కడి నుండే మాడ్యూల్‌ను నడిపించడంతో పాటు నిధులు కూడా సమకూర్చినట్లు భావిస్తున్నారు. ఫరీదాబాద్ మాడ్యూల్ భారత్‌లో బహుళ పేలుళ్లకు రూపొందించిన ప్రణాళిక వెనుక ఉకాసా కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. హ్యాండ్లర్లతో చర్చల సమయంలో నిఘా వర్గాలకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మాడ్యూల్ వెనుక విదేశీ గ్రూప్ ఉన్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. నెట్వర్క్ కార్యకలాపాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, నిందితుల చాట్, కాల్హిస్టరీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఉకాసా గుర్తించబడిన తర్వాత, అతడి పాక్ ఉగ్రవాద నిర్వాహకులతో సంబంధాలను తెలుసుకోవడానికి విదేశీ నిఘా సంస్థల సహకారం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో అరెస్టు:
ఫరీదాబాద్ మాడ్యూల్‌కు సంబంధించి మరో డాక్టర్‌ను భద్రతాధికారులు అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన కార్డియాలజిస్ట్ విద్యార్థి డాక్టర్ మహ్మద్ ఆరిఫ్‌ను కాన్పూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఇటీవల అరెస్టయిన డాక్టర్ షాహిన్‌తో దగ్గర సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరు నిత్యం టచ్‌లో ఉన్నారని సమాచారం.




















