ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) ఇంకా ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) వ్యవస్థలోకి చేరలేదని టెలికాం విభాగం కార్యదర్శి నీరజ్ మిత్తల్ తెలిపారు. దీనివల్ల ఆ వేదిక ద్వారా జరుగుతున్న యూపీఐ లావాదేవీలు రక్షణ లేకుండా జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఆర్‌ఐ వ్యవస్థలో భాగం కాకపోవడంతో మూడోవంతు యూపీఐ చెల్లింపులు అసురక్షితంగా ఉన్నాయన్నది టెలికాం విభాగం సూచించింది.
సైబర్ మోసాలను నివారించేందుకు టెలికాం విభాగం రూపొందించిన ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI)’ బ్యాంకులు, యూపీఐ సేవలందించే సంస్థలు, ఆర్థిక సంస్థలతో పంచుకునే ముందస్తు సమాచారంపై ఆధారపడి పనిచేస్తుంది.
డిజిటల్ చెల్లింపులు చేసే ప్రతి సారి, ఈ టూల్ సంబంధిత మొబైల్ నంబరును పరిశీలించి, ఆ నంబరు మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొన్న అవకాశం ఎంత ఉందో అంచనా వేస్తుంది. ఈ రిస్క్ స్థాయిని ‘మీడియం’, ‘హై’, ‘వెరీ హై’ అనే కేటగిరీల్లో వర్గీకరిస్తుంది.
టెలికాం విభాగం సూచనలతో డిజిటల్ చెల్లింపుల భద్రతపై కొత్త చర్చ మొదలైంది
ఏదైనా మొబైల్ నంబర్ ‘హై రిస్క్’గా గుర్తించబడితే, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, యూపీఐ సేవలందించే సంస్థలు అదనపు భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఫోన్‌పే, పేటీఎం వేదికలు ఇప్పటికే ఎఫ్‌ఆర్‌ఐ (FRI) వ్యవస్థను వినియోగిస్తున్నాయి.
అయితే, గూగుల్ పే మాత్రం ఇంకా ఈ వ్యవస్థలో భాగం కాలేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే వాటా సుమారు 30-35 శాతం ఉన్నందున, ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.




















